ఓయూలో మెస్ లు, హాస్ట‌ల్స్ బంద్.. !!

ఉస్మానియా యూనివ‌ర్శిటీలో మంగ‌ళ‌వారం నుంచి హాస్ట‌ల్స్, మెస్ ల‌ను బంద్ చేస్తూ వీసీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. నెల రోజుల వ‌ర‌కు హాస్ట‌ల్స్ మూత‌ప‌డ‌నున్నాయి. అక‌స్మాత్తుగా ఇలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ నిర్ణ‌యం భ‌గ్గుమంటున్నాయి. ఓయూ విద్యార్ధి ముర‌ళి ఆత్మ‌హ‌త్య‌తో ఉస్మానియా వాతావ‌ర‌ణం వేడెక్కిన విష‌యం తెలిసిందే.

ఆ ఆత్మ‌హ‌త్య విష‌యంపై ఇప్ప‌టికీ యూనివ‌ర్శిటీలో ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో ఓయూలో ఆందోళ‌న తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు వీసి నుంచి ప్ర‌భుత్వం ఈ నోటీసుల‌ను జారీ చేయించి ఉండ‌వ‌చ్చిన ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. హాస్ట‌ల్స్ మూసివేయడం కుట్ర‌పూరిత‌మంటూ మండిప‌డుతున్నారు.

ఈనెల 12 నుంచి జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు నెల రోజుల‌కు పైగా పీజీ హాస్ట‌ల్స్, మెస్ మూసివేస్తున్న‌ట్లుగా నోటీసులు పంపించారు. ఎలాంటి కార‌ణంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నేదానిపై మాత్రం స్ప‌ష్ట‌త‌లేదు. పీజీ విద్యాసంస్థ‌ల‌కు , యూనివ‌ర్శిటీ క‌ళాశాల‌ల‌కు ఎలాంటి సెల‌వు ప్ర‌క‌టించ‌క‌పోయినా హాస్ట‌ల్స్ మూసివేయ‌డమేంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగినా.. రాష్ట్ర ఏర్పాటు త‌రువాత ఇలాంటి చర్యలు చేప‌ట్ట‌డం ఇదే మొద‌టిసార‌ని చెప్పుకుంటున్నారు.