కొత్త ఏడాదిలో కొత్త‌గా ముందుకు….! తెలంగాణ‌లో బీజేపీ వ్యూహ‌మేంటి..?

తెలంగాణ‌లో బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్ళాల‌ని భావిస్తోంద‌ట‌. గుజ‌రాత్ ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలో స్పీడ్ పెంచేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటోంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఇక పూర్తిస్థాయిలో తెలంగాణ‌పై దృష్టి పెట్టాల‌ని జాతీయ నాయ‌క‌త్వం భావిస్తోంది. ఇప్ప‌టికే జ‌న‌వ‌రిలో అమిత్ షా ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టించింది.

కొత్త ఏడాది ఆరంభంలో మూడు రోజులపాటు బీజేపీ బాద్ షా అమిత్ షా తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ప‌ర్యట‌న కోసం ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించి పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ల‌క్ష్మ‌ణ్. గుజరాత్ ఎన్నికల తరువాత రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు జ‌రుగుతాయ‌ని పార్టీ రాష్ట్ర నాయ‌కత్వం ధీమాగా చెబుతోంది. ప్రతి మూడు నెలలకొక సారి తెలంగాణలో పర్యటనలు చేసి పార్టీకి బలోపేతానికి అమిత్ షా దిశా నిర్ధేశం చేస్తార‌ట‌. షా ప‌ర్య‌ట‌న‌లో పార్టీలోకి వచ్చే వారిని ఆకర్షించి బహిరంగ సభలు ఏర్పాటు చేయాల‌ని ఆ పార్టీ భావిస్తోంది.

2019లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని బీజేపీ నేతలు చెబుతున్నా ఎన్నిక‌ల్లోగా ఆస్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన‌వ‌స‌రం ఉంది.ఒక‌వేళ అనివార్య ప‌రిస్థితుల్లో పొత్తుల‌కు వెళ్లాల్సి వ‌స్తే ఏం చేయాల‌నేదానిపై కూడా ముందుగానే ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డింది బీజేపీ. అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని పొత్తుల‌పై అమిత్ షా నిర్ణయం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది రాష్ట్ర నాయ‌క‌త్వం. మ‌రి కొత్త ఏడాదిలో పార్టీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో.. ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నేది వేచి చూడాలి మ‌రి.. !