గవర్నర్ తో కేసీఆర్’కు బెడసికొట్టిందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. గత గవర్నర్ నరసింహాన్ తో సీఎం కేసీఆర్ కు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. వీరిద్దరు గురు-శిష్యులుగా ఉండేవారు. నరసింహాన్ గవర్నర్ కంటే.. తెరాస నేతగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చేవి. అయితే తాజా గవర్నర్ తమిళ సైతో సీఎం కేసీఆర్ కి అలాంటి అనుబంధం కుదరలేదు.

గవర్నర్ తమిళపై కి, ప్రభుత్వానికి మద్య అంతరం పెరుగుతోందని అనిపిస్తోంది. ఆమె ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని వార్తలు వినిపించాయి. నెటిజన్స్ హైదరాబాద్ లో కరోనా సమస్యపై ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో పరిస్థితి దయనీయంగా ఉందని, ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, ఇక, ఇప్పుడు గవర్నర్ చొరవ చూపాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే, కరోనా పరిస్థితిపై చర్చించటానికి ఉన్నతాధికారులను పిలిచినట్లు సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ తెలిపారు.. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి రావాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజ్‌భవన్‌ కబురు పెట్టినట్లు సమాచారం. కానీ, వీరిద్దరూ వెళ్లలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, తాము రాలేమని రాజ్‌భవన్‌కు స్పష్టం చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తో సర్కార్ కి బెడిసింది అనే ప్రచారం మొదలైంది.