కోకాపేట్‌ భూముల్లో గోల్‌మాల్‌.. సీబీఐకి ఫిర్యాదు !

తెలంగాణలో కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల్లో గోల్‌మాల్‌ జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అనుకూలమైన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. రాహుల్ ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన తరవాత సీబీఐ డైరక్టర్‌ను నేరుగా కలిసి భూముల అమ్మకాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిందన్న ఆధారాలు కూడా ఇచ్చానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్పుష్ప కంపెనీ పేరుతోనూ తక్కువకు భూములు కొనుగోలు చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు. ఎకరం రూ. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమికంతా మళ్ళీ టెండర్లు పిలవాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినంత మాత్రనా సీబీఐ రంగంలోకి దిగుతుందా ? అంటే.. దిగకపోవచ్చు. ఎందుకంటే ? రేవంత్ ఇచ్చిన ఫిర్యాదు.. దానికి సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం లేదు. కోర్టులైనా ఆదేశించాలి లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే సిఫార్సు చేయాలి. ఆ రెండు జరిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. అందుకే రేవంత్ బీజేపీ నేతలని టార్గెట్ చేస్తున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తారు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని.. వారు వారు ఒకేటనని విమర్శించారు. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ షాలతో చెప్పి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.