జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మీటింగ్

తెలంగాణ విషయంలో బీజేపీ అధిష్టానం పూర్తి స్పష్టతతో ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా వేగంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీతో కార్పొరేటర్లు భేటీ కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
మంగళవారం సాయంత్రం 4గంటలకు కార్పొరేటర్లతో మోడీ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు సైతం ప్రధానిని కలవనున్నట్టు సమాచారం. కార్పొరేటర్లతో పాటు బీజేపీ సంస్థాగతంగా ఉన్న రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ అర్బన్, భాగ్యనగర్, మహంకాళి, గోల్కొండ, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాల అధ్యక్షులు సైతం ఈ సమావేశం భాగస్వాములు కానున్నట్టు తెలుస్తోంది.
