పుష్ప 2లో మాళవిక మోహనన్ ?

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఆమె సొంతం. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. చేసిన ఏడు సినిమాలతో నాలుగు బాషలను కవర్ చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ బాషల్లో నటించింది. విజయ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ స్టార్ రజనీకాంత్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది. అయితే చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం దక్కడం లేదు.
మరోవైపు మాళవిక కు బంపర్ ఆఫర్ ఒకటి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు బన్నీ నటన, సుకుమార్ టేకింగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుందని చెబుతున్నారు.
సీక్వెల్ లో మరికొంత మంది కొత్త నటీనటులు కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారట. తాజాగా మాళవిక మోహనన్ పేరు తెరపైకి వచ్చింది. పుష్ప 2 లో ఆమె కీలక పాత్రలో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీతో మాళవిక ఫోటోలు కలిపి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
