బీజేపీ ‘చైతన్యం’ ఫలించిందా..!?

తెలంగాణలో ‘జన చైతన్య యాత్ర’ పేరుతో ఎన్నికల వార్ ను ప్రారంభించిన బీజేపీ బస్సు యాత్ర ముగిసింది. తొలివిడత బీజేపీ బస్సు యాత్రలో తెలంగాణలో కీలకమైన ప్రాంతాల్లో పర్యటించింది ఆ పార్టీ. అధికార టీఆర్ఎస్ టార్గెట్ గా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటైన విమర్శలు కురిపిస్తూ ఈ యాత్ర ముందుకు సాగింది. యాత్ర విజయవంతమవడంతో పాటు ఆ పార్టీ జాతియాధ్యక్షుడు అమిత్ షా ప్రశంసలు కూడా అందుకోవడంతో టీ-బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.
భారీ బహింరగ సభలు, రోడ్ షోలు, పల్లెనిద్రలతో 14 రోజుల పాటు సాగిన బస్సు యాత్ర బీజేపీ గత కార్యక్రమాలకు భిన్నంగా నిర్వహించారు. జన సమీకరణతో పాటు పార్టీ నేతల మధ్య ఎక్కడా సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీతో టీఆరెస్ అంతర్గత ఒప్పందం చేసుకుందన్న కాంగ్రెస్ విమర్శలను తీపి కొట్టడంలో బీజేపీ సఫలమైంది. టీఆరెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అంటూ కాంగ్రెస్ విమరహించడాన్ని యాత్రలో దుయ్యబట్టారు లక్ష్మణ్. ఊహించని విధంగా బహిరంగ సభల్లో కేసీఆర్, టీఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. ఒకానొక సందర్భంలో బీజేపీ నేత రామ్ మాధవ్ ఒకడుగు ముందుకేసి టీఆరెస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది.
జూన్ నెల 23న యాదాద్రిలో మొదలైన జన చైతన్య యాత్ర మునుగోడు, కడ్తాల్, కొత్తకోట, మహబూబ్ నగర్, పటాన్ చెరువు, సిద్ది పేట, కామారెడ్డి, ఆర్మూర్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ మీదుగా తుంగతుర్తిలో భారీ బహిరంగ సభతో ముగిసిసింది.ప్రతీ నియోజక వర్గంలో తమ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రధానంగా కౌలు రైతులకు పెన్షన్ విధానం, రైతులకు 2లక్షలు రుణమాఫీ, రైతు బంధు పథకం 7500వరకు ఇస్తామన్న హామీలు ప్రజల్లోకి వెళ్ళాయి.. బిజెపి అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం.. రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించి ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ హామీ ఇస్తూ యాత్రలో ముందుకెళ్లారు.
ఓవరాల్ గా తెలంగాణలో బీజేపీ జనచైతన్య యాత్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.బీజేపీ, టీఆరెస్ ములాఖత్ విమర్శలపై కాంగ్రెస్ కు సమాధానం చెప్పడమే కాకుండా, తమపై కాంగ్రెస్ వేయలనుకున్న ముద్రను శాశ్వతంగా చేరిపివేయడంలో బీజేపీ సఫలమైంది.అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేస్తూ ప్రజల్ని ఆలోచనలో పడేయడంలో బీజేపీ విజయం సాధించిందని చెప్పొచ్చు. మొత్తంగా తొలివిడత యాత్ర స్పూర్తితో త్వరలోనే రెండోవిడత యాత్రకూ బీజేపీ సిద్ధమవుతోందట… !
