మునుగోడు ఉప ఎన్నిక : అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది. స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ తదితరులు టికెట్‌ను ఆశించారు. అయితే స్రవంతి రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.

ఇక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలాఖరులోగా ఎన్నిక పూర్తికానుందని చెబుతున్నారు.