‘ఆ నలుగురు’ ఏపీకి ‘దుష్ట‌చ‌తుష్ట‌యం’గా మారారు…!!

వైసీపీ అధినేత జ‌గ‌న్, జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీతో ఆ రెండు పార్టీలు లాలూచీ ప‌డ్డాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబును రాజీనామా చేయ‌మ‌నడం ఈ మూడు పార్టీల గేమ్ ప్లాన్ లో భాగ‌మేన‌ని అన్నారు య‌న‌మ‌ల‌. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు పోరాటం చేస్తున్నార‌ని, జ‌గ‌న్, ప‌వ‌న్ టీడీపీని ఎలా ఓడించాలా అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అందుకే న‌రేంద్ర మోదీ డైరెక్ష‌న్ లో గోతులు తవ్వే ప‌నిలో ఉన్నార‌ని విమ‌ర్శించారు. ఏపీపై కేంద్రం ఇంత వివ‌క్ష చూపుతున్నా మోదీ, అమిత్ షా పై నోరుతెర‌వ‌ని పార్టీల‌తో టీడీపీ ఎలా క‌లిసి పోరాడుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మోదిని చూసి చంద్రబాబు భయపడుతున్నట్లు పవన్,జగన్ వ్యాఖ్యలు చేయ‌డం పెద్దజోక్ అన్నారు య‌న‌మ‌ల‌. ప్రధానమంత్రిని చూసి ఏ ముఖ్యమంత్రి అయినా భయపడతారా అని ప్ర‌శ్నించారు. భయపడితే 12ఛార్జిషీట్ల ప్రధాన నిందితుడు భయపడతాడ‌ని, ఐటి దాడులు చేస్తారని అక్రమార్జన చేసేవారు భయపడాల‌ని ఆయ‌న విమర్శించారు. బిజెపి మోసాన్ని ఎండగట్టింది, బిజెపి నమ్మకద్రోహాన్ని దేశం మొత్తం చాటింది చంద్రబాబే అన్నారు య‌న‌మ‌ల‌. రాజీనామా చేసిన వైసిపి ఎంపిల వల్ల ఏం ప్రయోజనం వచ్చిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. అందరూ రాజీనామా చేస్తేనే తాను పోరాటంలో దిగుతాన‌నడం పిరికితనానికి పరాకాష్ట అన్నారాయ‌న‌. ఇక్కడ జగన్,పవన్ అక్కడ నరేంద్ర మోది,అమిత్ షా ఈ నలుగురి అజెండా టిడిపిని ప్రజలకు దూరం చేయడమేన‌ని, వారు ఆంధ్రప్రదేశ్ పాలిట దుష్టచతుష్టయంగా మారార‌ని విమ‌ర్శించారు.