వైద్యశాఖలో నియామకాలపై మంత్రి సమీక్ష..

తెలంగాణ వైద్య విధాన పరిషత్ సహా, మిగతా విభాగాల అభ్యర్థులకు పోస్టింగులు కూడా పారదర్శకంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఓ పద్ధతి ప్రకారం పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ నియామకాల మీద సంబంధిత అధికారులతో ఆరోగ్యశ్రీ కార్యాలయంలో సమీక్షించారు మంత్రి లక్ష్మారెడ్డి.
చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1133 పోస్టుల నియామకం చేపట్టామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందులో 919 పోస్టుల ఇప్పటికే భర్తీ ప్రక్రియ పూర్తయిందని, మిగతా పోస్టులకు స్పెషాలిటీ అభ్యర్థులు అందుబాటులోకి రాలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గమనించి, అక్కడ వారిని నియమించాలని, ప్రజావైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కెసిఆర్ కిట్ల పథకం ద్వారా సర్కార్ దవాఖానాల్లో ప్రసూతిలు పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టకుని, ఎనస్తీషియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను నియమించాలన్నారు.
