కరుణానిధి అంత్యక్రియలు పూర్తి

తమిళనాడు రాజకీయ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు డీఎంకే శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివచ్చారు. కరుణానిధికి కన్నీటి వీడ్కోలు పలికారు. తన రాజకీయ గురువు అన్నాదురై స్మారక కేంద్రానికి ఆనుకుని ఉన్న అన్నా స్వ్కేర్‌లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. కరుణానిధి అంతిమ యాత్ర 3గంటల పాటు సాగింది.
సాయంత్రం 4గంటలకు రాజాజీ హాలు నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం, శివానంద రోడ్‌, తంతైపెరియార్‌ రోడ్‌ మీదుగా మెరీనా బీచ్‌ వరకు సాగింది. మెరీనా బీచ్‌లోని మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రం సమీపంలో అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో రాత్రి 7 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ముగించారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ‘విరామం ఎరుగకుండా శ్రమించిన నాయకుడు.. ఇదిగో విశ్రమిస్తున్నాడు’ అని శవపేటిక మీద తమిళంలో రాయించారు.