మోడీ టీంలో కొత్తగా 43 మంది

కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 43 మంది మంత్రులు వచ్చేశారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగే కార్యక్రమంలో మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో.. దాదాపుగా పదిహేను మందికి ఉద్వాసన పలికారు. అందులో సదానందగౌడ, పోఖ్రియాల్, హర్షవర్ధన్ వంటి కీలక మంత్రులు ఉన్నారు. ఊహించని విధంగా కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, జవదేకర్ కూడా రాజీనామా చేశారు. వెంటనే వీరి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా సామాజిక సమీకరణాలు.. సామర్త్యం లెక్కలోకి తీసుకుని కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించినట్లుగా తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి.. కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది. ఏపీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. సీఎం రమేష్, జీవీఎల్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఒక్కరికి కూడా అవకాశం లభించలేదు. బహుశా.. భారతదేశ చరిత్రలోనే ఏపీ నుంచి కేంద్ర మంత్రి లేకపోవడం.. ఇదే తొలిసారి కావొచ్చేమో.. !
