తెలంగాణ బీజేపీని వీక్ చేస్తున్న గవర్నర్ తమిళిసై

తెలంగాణ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే భావన ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. ఈ విషయంలో టీ కాంగ్రెస్ కృషి ఫలించిందని కూడా చెప్పాలి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావించారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతుందని టీ పీసీసీ చీఫ్ పదే పదే ఆరోపిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన ప్రజలకు కూడా బీజేపీ-బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీలని అర్థం అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను లైట్ తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటి కాదని నిరూపించుకోవడానికి.. కమలం పార్టీ పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. నిన్న జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. బీజేపీ – బీఆర్ ఎస్ ఉతర-దక్షిణ ధృవాలు.. అవి రెండు ఎప్పటికీ కలవవని నిరూపించాలని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే అదే రోజున గవర్నర్ తమిళిసై టీ – బీజేపీని వీక్ చేసే వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రాజ్ భవన్ లో కాఫీ టేబుల్‌బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై సీఎం కేసీఆర్ పై ఒకింత ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ ఎంతో అనుభవం, ముందుచూపున్న నాయకుడు. నాలుగేళ్లుగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య ఎలాంటి సమన్వయలోపం లేదు. కేసీఆర్ ఆహ్వానం మేరకే నేను సచివాలయానికి వెళ్లాననని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ మీద గవర్నర్ పొగడ్తలు కురిపించడం బహుశా ఇదే తొలిసారి. ఓ వైపు బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్కటి కాదని నిరూపించడానికి.. కమలం నేతలు కిందా మీదా పడుతుంటే.. మరోవైపు సీఎం కేసీఆర్ అద్భుతన నేత.. ఇన్నాళ్లు తానే పూర్తి స్థాయిలో పని చేయలేకపోయా. కేవలం 15 శాతం పర్ ఫామెన్స్ మాత్రమే చూపించగలిగానని గవర్నర్ అనడం విశేషం. తమిళిసై వ్యాఖ్యలు టీ బీజేపీ స్టాండ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
