కర్ణాటకలో రాజకీయ సంక్షోభం.. ఓ ట్విస్ట్ !

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సభాపతి రమేశ్ కుమార్ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఐతే, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే తమ రాజీనామాను వెనక్కి తీసుకుంటామని కొందరు డిమాండ్ చేశారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో సిద్ధరామయ్య హస్తం కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.
మరోవైపు, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ శివకుమార్ ఉన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని భాజపా నేత సదానంద గౌడ అన్నారు. ‘గవర్నర్ అత్యున్నత అధికారి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మమ్మల్ని పిలిస్తే మేం సిద్ధంగా ఉన్నాం. మేం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ’ అని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారని సదానంద గౌడ చెప్పడం విశేషం.
