భాజపాతో పొత్తువల్లే తెదేపా గెలిచింది : జావడేకర్‌


2014లో భాజపాతో పొత్తువల్లే తెదేపా గెలిచిందన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌. తిరుపతిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జావడేకర్‌ మాట్లాడుతూ.. మోదీని ప్రధాని బాధ్యతల నుంచి సెలవు తీసుకునేట్లు చేస్తామన్న నేతలంతా.. సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.మోదీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న నేతలను, పార్టీలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారంటూ పరోక్షంగా తెదేపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు సైతం ఆ గందరగోళంలో భాగమేనంటూ జావడేకర్‌ అన్నారు. ఇక, కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజాపా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏపీలో తెదేపా, జనసేన కీలక నేతలని పార్టీలో చేర్చుకుంటోంది. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రముఖులు కమలం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకి బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా మారేలా కనిపిస్తోంది.