మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కొలువుదీరబోతుందా ? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయ్. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని మహారాష్ట్ర భాజాపా గవర్నర్ కలిసి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీయే కు శివసేన గుడ్ బై చెప్పింది.
కేంద్ర పదవుల్లోని తమ నాయకుల చేత రాజీనామా చేపిస్తోంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ‘తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. దీంతో ముంబైతో పాటు ఢిల్లీ రాజకీయాలు సైతం ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షరతు పెట్టిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే శివసేన ఎన్డీయే నుంచి బయటికొచ్చింది. ఇక, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా కనిపిస్తోంది.
