రివ్యూ : అమ్మరాజ్యంలో కడపబిడ్డలు

చిత్రం : అమ్మరాజ్యంలో కడపబిడ్డలు (2019)

నటీనటులు : అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మనందం, అలీ, పృథ్వీ తదితరులు

దర్శకత్వం : సిద్దార్థ తాతోలు

నిర్మాత : అజయ్ మైసూర్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్, 2019

రేటింగ్ : 2.5 /5

‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ ముందుగా అనుకొన్న టైటిల్ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో, రెండు సామాజికవర్గాల సమీకరణాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైసీపీ కొట్టిన దెబ్బకు తెదేపా నేతలకు దిమ్మతిరిగిన ఏపీసోడ్ ను చూపించాలనుకొన్నాడు. పార్టీలు పేర్లు మార్చిన నేతల యాస, భాష, అలంకరణ అదే పెట్టాడు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ పొలిటికల్ సటైర్ ఎలా ఉంది ?

కథ : 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్) నాయకత్వంలోని ఆర్.సీ.పీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎన్నో యేళ్ల రాజకీయ అనుభవం గల బాబు (వెలుగుదేశం పార్టీ) అధినేత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ నాథ్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనినెరవేర్చడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. దూసుకెళ్తుంటాడు.

మరోవైపు, అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో జగన్ నాథ్ రెడ్డి.. బాబును మాటల దాడితో హేళన చేస్తూ ముప్పుతిప్పలు పెడతారు. ఆ అవమాన భారంతో, తన చేతగాని కొడుకును చూస్తూ బాబు కుమిలిపోతుంటాడు. బాబును అలా చూడలేని ఆయన ప్రధాన అనుచరుడు దయనేని రమా, జగన్ నాథ్ రెడ్డి పై కుట్రలు పన్నుతాడు. కానీ ఆ క్రమంలోనే రమా అతి దారుణంగా హత్యకు గురవుతాడు. దయనేని రమాను హత్య చేయించింది ఎవరు? అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది.

ఎలా ఉందంటే ?

ఏపీ తాజా రాజకీయాలని కల్పిత పాత్రలు, కల్పిత కథతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తెరకెక్కించారు. ఫస్టాఫ్ సీన్లు మక్కికి మక్కి కాపీ కొట్టినట్టు ఉంటుంది. అదే ఈ సినిమాకి ప్రేక్షకులు రావడానికి ఉపయోగపడింది. కథ-కథనం గురించి పక్కనపెడితే..  ఆయా పాత్రలకి ఎంచుకున్న నటులు, నిజ జీవిత పాత్రలకి జెరాక్స్ కాపీలా ఉండడం కూడా ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పప్పు సాంగ్ లోని కొన్ని మోమెంట్స్ నవ్విస్తాయి.

పాల్ రోల్ పై తీసిన సాంగ్ కూడా బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ అయిన దేవినేని రమ మర్డర్ సీన్ బాగుంది. కెఏ పాల్ స్ఫూర్తిగా కనిపించే పిపి చాల్ పాత్ర సెకండాఫ్ లో నవ్విస్తుంది. ఈయన రెండు మూడు సన్నివేశాలే సెకండాఫ్ లో రిలాక్సింగ్ గా అనిపిస్తాయి. చినబాబు రోల్ చేసిన వ్యక్తి హవభావాలతో ఆకట్టుకొన్నాడు. మనసేన అధ్యక్షుడు చేయి ఊపుకుంటూ చేసే హడావిడి.. ఆయన జుట్టు సరి చేసుకోవడం ఇవన్నీ సినిమాలో సిటీమార్ పాయింట్సే.

ఈ చిత్రంలో వీఎస్ జగన్నాథ్ రెడ్డి పాత్రను పోషించిన అజ్మల్ అమీర్, బాబు పాత్ర, చినబాబు క్యారెక్టర్, చినబాబు ఆకాష్ భార్య రమణి, మనసేన పార్టీ, ప్రపంచ శాంతి పార్టీ అధినేతల క్యారెక్టర్స్ ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి. వీఎస్ జగన్నాథ్ రెడ్డి, బాబు పాత్రలను పోషించిన వారు కళ్లతోనే నటించేశారు. వారి హావాభావాలు సైతం అందర్నీ ఆకట్టుకుంటాయి.అలీ, పృథ్వీ, స్వప్న, ధన్ రాజ్, కత్తి మహేష్ లాంటి వారు కూడా తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా : 

వర్మ కథ-కథనం కంటే పాత్రల ప్రజెంటేషన్ పైనే ఫోకస్ పెట్టాడు. నేతల మేనరిజంతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు. దయనేని రమని హత్య చేయించింది చినబాబు భార్య అని చూపించడం ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని స్టెప్ అయితే.. అతకలేదు. వి శంకర్ అందించిన సంగీతం బాగుంది. మనుషుల స్వభావం, వారి ఆలోచనలు, వారి చేష్టలను నేపథ్య సంగీతంతోనే ప్రజెంట్ చేసేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా పనితనం బాగుంది. సినిమాలో కొన్ని చోట్ల సాగదీత కనిపించింది. కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5