గొల్లపూడి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ రచయిత, సంపాదకుడు, నటుడు గొల్లపూడి మారుతి రావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. గొల్లపూడి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లపూడి మారుతీరావు మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్ గొల్లపూడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారని సీఎం జగన్ గుర్తుచేశారు.
మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పత్రికలో పనిచేస్తూనే రచయితగా మారి అనేక కథలు, నాటకాలు రాశారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం చైన్నైలో జరగనున్నాయి.
