వైరల్ : వీడియోకాల్‌లో వివాహ తంతు
కరోనా కట్టడి కోసం దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్, పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే ఓ జంట మాత్రం పెళ్లిని వాయిదా వేసుకోవడం ఇష్టం లేక వీడియో కాల్ లోనే పెళ్లి చేసుకొన్నారు. శుక్రవారం ఔరంగాబాద్ ఈ వివాహ తంతు జరిగింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన మహ్మద్ మిన్హాజుద్‌కు.. బీడ్ జిల్లాకు చెందిన ఓ యువతితో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. అప్పుడు కరోనా ప్రభావం లేకపోవడంతో వివాహ తేదీని ఏప్రిల్ 3గా నిర్ణయించినట్లు పెళ్లికుమారుడి తండ్రి మహ్మద్ గయాజ్ తెలిపారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని వేడుకలు, సమావేశాలు రద్దయ్యాయి. జనాలు ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ పెద్దల సమక్షంలో ఇంట్లో నుంచే.. సదరు యువతితో వీడియోకాల్ ద్వారా వివాహం జరిపించారు. ఇప్పుడు వీరి పెళ్లి వైరల్ అవుతోంది.
