కరోనాతో ఆరోగ్యశాఖ మాజీ మంత్రి మృతి

దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, మంత్రులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా గోవా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సురేష్ అమోన్‌కర్ కరోనాతో మరణించారు. గతవారమే సురేష్ అమోన్‌కర్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే ఆయన్ని మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ అమోన్ కర్ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

ఇక దేశంలో ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 20వేలకిపైగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 22,252 కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక నిన్న ఒక్కరోజే 467మంది మృత్యవాతపడ్డారు. దీంతో భారత్‌లో కొవిడ్ మృతుల సంఖ్య 20,160కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకోగా మరో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణతో భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో కొనసాగుతోంది.