దుబ్బాకలో తెరాస ఓటమి వెనక హరీష్ రావు రాజకీయం ?

‘తెలంగాణలో ఎన్నికలేవైనా గెలుపు మాత్రం తెరాసదే’. ఈ ట్యాగ్ లైన్ నిన్న మధ్యాహ్నం వరకు మాత్రమే. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఓటమితో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయ్. ఇకపై వన్ సైడ్ వార్ ఉండదు. తెరాసకు ధీటుగా భాజాపా నిలవనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ విషయం పక్కనపెడితే.. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం ఖాయం అనుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని మంత్రి హరీష్ రావు తీసుకోవడంతో గెలుపుపై ఎవరికి కూడా కించిత్తు అనుమానం కలగలేదు. అదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం, ఆ తర్వాత వచ్చే గ్రేటర్ ఎన్నికలో తెరాస మరోసారి ఘన విజయం సాధిస్తే.. మంత్రి కేటీఆర్ ని సీఎం పీఠంపై కూర్చో బెట్టనున్నారు. దీని కోసం ఇప్పటినుంచే మంచి ముహూర్తాన్ని చూస్తున్నారు సీఎం కేసీఆర్ అనే ప్రచారం జరిగింది.
 
అప్పుడు దుబ్బాకలో తెరాసని గెలిపించిన మంత్రి హరీష్ రావుకు నిరాశ తప్పదనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరిగింది. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బాహాటంగానే ఈ మాటలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో దుబ్బాక లో తెరాస ఓటమి వెనక మంత్రి హరీష్ రావు ఏమైనా రాజకీయం చేసి ఉంటారా ? అనే అనుమానాలని కొందరు తెరాస నేతలే వ్యక్తం చేస్తున్నట్టు సమాచారమ్. 

ఇది అపోహ మాత్రమే. యుద్ధంలోకి దిగాక ఎవరైనా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి హరీష్ రావు అదే చేసి ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఓటమితో ఆయనపై కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఇక దుబ్బాకలో ఓటమికి నాదే బాధ్యత అని హరీష్ రావు చెప్పిన సంగతి తెలిసిందే.