ధోని ఎంపికపై ఫిర్యాదు

త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఆడనున్న టీమిండియాలో మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఆయన్ని మెంటార్‌గా నియమించింది బీసీసీఐ. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని రికార్దు నెలకొల్పాడు. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టించిన ధోనిని మెంటార్‌గా నియమించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మరోవైపు అతడి ఎంపికపై విమర్శలు కూడా వస్తున్నాయి.

ధోని ఎంపిక పట్ల మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఎమ్‌సీఏ) మాజీ సభ్యుడు సంజీవ్‌గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఆయన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్లు సౌరభ్‌ గంగూలీ, జే షాలకు లేఖ రాశారు. 

దీనిపై సౌరభ్‌ గంగూలీ స్పందిస్తూ.. రెండు ఐసీసీ ప్రపంచకప్‌లు గెలిచిన మాజీ కెప్టెన్‌ ధోని అనుభవం టీమిండియాకు కలిసోస్త్తుందనే ఉద్దేశంతోనే మెంటార్‌గా నియమించినట్లు పేర్కొన్నారు.