బాబుతో ఓ టీకాంగ్రెస్ నేత భేటీ పై బదులిచ్చిన భట్టి..!!

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. సోనియాపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో పాటు చంద్రబాబుతో టీకాంగ్రెస్ నేత ఒకరు భేటీ అయ్యారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. వచ్చే ఎన్నికలలో పొత్తులపైనా తన అభిప్రాయాలను వెల్లడించారు. అవగాహన ఉన్నవాళ్లెవరూ అమ్మ, బొమ్మ అనరని, అవసరం ఉన్నంత వరకు సోనియాను అమ్మ అని, ఇప్పుడు బొమ్మ అనటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు భట్టి.
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల ఊ|హాగానాల నేపథ్యంలో భట్టి స్పష్టతనిచ్చారు. పొత్తులు ఎవరితో, ఎలా ఉంటాయో ఇప్పుడప్పుడే చెప్పలేమని అన్నారాయన. ఎన్నికలనాటి అవసరాలకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు కాంగ్రెస్ కు కొత్త కాదని, ఎన్నికలెప్పుడొచ్చినా తాము సిద్ధమని చెప్పారాయన. పార్టీలోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని, ఎవరిని ఎప్పుడు ఆహ్వానించాలనేది సంప్రదింపుల కమిటీ చూసుకుంటుందన్నారు.
రాహుల్ గాంధీ పై సుబ్రమణ్య స్వామీ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క ఖండించారు. పార్టీ కి నష్టం జరకుండా ప్రతి నేత వ్యవహరించవల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో ఓ టీకాంగ్రెస్ నేత భేటీ అయ్యారన్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బస్ యాత్ర ,పాదయాత్ర లు ఎప్పుడు ఎలా ఉంటాయన్నది కుంతియా చెబుతారని అన్నారు భట్టి.
