ప్రధానిపై కేసీఆర్ వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా..!?

రైతు సమన్వయ సమితి సమావేశం వేదికగా ప్రధానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయోగించిన వాగ్భానాలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధానిని ఏకవచనంతో సంబోధించడాన్ని బీజేపీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన విషయంతెలిసిందే.
మరోవైపు సీఎం కేసీఆర్ కావాలని ప్రధానిపై ఆ వ్యాఖ్యలు చేసినవి కాదని, కేవలం మాటల సందర్భంలో దొర్లిన తప్పిదం మాత్రమేనంటూ మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సర్థి చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రధానిపై కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే వీరిద్దరిదీ కేవలం ఫ్రెండ్లీ ఫైట్ అంటూ విమర్శిస్తోంది.

తెలంగాణలో రైతుల్లో అసంతృప్తి ఉందని సీఎం కేసీఆర్ గ్రహించారు. ఆ అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేకతగా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. ప్రతీ రైతుకు ఎకరానికి నాలుగువేల పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ విపక్షాల ప్రచారం వల్ల ఎక్కడో ఒకచోట రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని ఆయన గ్రహించారని, అది జరగకుండా ఉండేందుకే రైతు సమన్వయ సమితి సమావేశాన్ని వేదిక చేసుకున్నారనే చర్చ కొనసాగుతోంది.
పంట గిట్టుబాటు ధర, రైతాంగ సమస్యల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడకుండా ఉండాలంటే కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించక తప్పదని భావించారట సీఎం కేసీఆర్. అందులో భాగంగా కాస్త డోస్ పెంచి కేంద్రంపై , ప్రధానిపై విమర్శలు చేశారని, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే అలా చేసిఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
