టీఆర్ఎస్’తోనే టీటీడీపీ పొత్తు??

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. రాజ‌కీయ పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సిద్ధ‌మ‌య్యే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. తెలంగాణ‌లో టీడీపీ దాదాపు ఖాళీ అయ్యింద‌ని , ఉన్న నేత‌ల్లో, కేడ‌ర్ లో ధైర్యాన్ని నింపి పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డ్డారు ఆ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ నేత‌ల‌తో స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, పార్టీ బ‌లోపేతంపై చ‌ర్చించారు కూడా.

సామాన్యుడి స‌మ‌స్య‌ల‌నే ఎజెండాగా క్షేత్ర‌స్థాయిలో జ‌నంలోకి వెళ్లి పార్టీ ప‌రంగా ఉద్య‌మాలు చేయాల‌ని నేత‌ల‌కు సూచించారు అధినేత చంద్ర‌బాబు. ఇక పొత్తుల‌పై కూడా త‌న‌దైన శైలిలో తెలుగు త‌మ్ముల్ల‌కు క్లారిటీ ఇచ్చేశార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పొత్తు ఉంటుంద‌ని తేల్చేశార‌ట‌. ఎవ‌రితో పొత్తు ఉంటుంద‌ని ఎన్నిక‌ల నాటికి క్లారిటీ ఇస్తాన‌ని చెప్పేశారు. దీంతో తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను అంచ‌నా వేసుకుంటున్నారు త‌మ్ముళ్లు.

కాంగ్రెస్ తో ఎలాగూ టీడీపీ పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు లేవు కాబ‌ట్టి, ఇక ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచించాల్సిన‌వ‌స‌రం లేదు. ఇక మిగిలింది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని , ఎవ‌రితోనూ పొత్తు ఉండ‌బోద‌ని ఇప్ప‌టికే బీజేపీ స్ప‌ష్టం చేసింది. ఇక ఆప్ష‌న్ ప్ర‌కారం చూసినా మిగిలింది అధికార టీఆర్ఎస్ పార్టీ కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఒప్పుకుంటే టీటీడీపీతో పొత్తుకు సై అంటుంది. ఎలాంటి పొత్తు లేకుండా టీటీడీపీ పోటీ చేసినా పెద్ద‌గా ఫ‌లితాలు రావ‌డం క‌ష్ట‌మే. అధికార‌పార్టీ అంగీక‌రిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ , టీడీపీ జ‌త‌కానున్నాయనుకుంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.