మంత్రి పదవిపై భూమన కామెంట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినేట్ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 8న కేబినేట్ విస్తరణ ఉండనుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కోసం వైకాపా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తిరుమతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి వద్దన్నట్టుగా మాట్లాడటం విశేషం.
గురువారం తిరుపతిలో నిర్వహించిన వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి భూమన హాజరయ్యారు. తనకి మంత్రి పదవిపై తనకెలాంటి ఆశలు లేవని భూమన అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రతి క్షణమూ తిరుపతి బాగుకోసమే పనిచేస్తానని చెప్పారు. తెదేపా బలంగా ఉన్న తిరుపతిలో ఘన విజయం సాధించటం చిన్న విషయం కాదని.. తిరుమల శ్రీవారికి ప్రతినిధిగా ఉండటం కంటే పెద్దపదవేమీ ఉండదన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
