వారు పైరసీ కంటే ప్రమాదకరం

టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకొన్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ట్రెండ్ సెట్ చేసింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించారు. ఐతే, ఈ చిత్ర కథపై పలువురు విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రీమేక్‌లో నటించినందుకు బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, కియారా అడ్వాణీని కూడా తప్పుపట్టారు. ఐతే, సినిమా మాత్రం థియేటర్లలో విజయవంతంగా రాణిస్తోంది. బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది.
ఈ నేపథ్యంలో విమర్శకులకి గట్టి సమాధానం చెప్పారు దర్శకుడు సందీప్ వంగా. ‘పైరసీ కంటే సినిమా కాన్సెప్ట్, బేసిక్స్ అర్థం చేసుకోని విమర్శకులు చిత్ర పరిశ్రమకు అత్యంత ప్రమాదకరం. రచన, డైరెక్షన్.. తదితర అంశాల కోసమే ‘కబీర్ సింగ్’ సినిమాను రాశాం. కొందరు ఈ చిత్రానికి రెండు స్టార్లు ఇచ్చారు, కానీ ప్రేక్షకులు మాకు రూ.200 కోట్లు ఇచ్చారు’ అన్నారు సందీప్ వంగా. ఇక, కబీర్ సింగ్ హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పట్లో ఆగేలా లేదు.
టాలీవుడ్, బాలీవుడ్ లోనూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు సందీప్ వంగా. ఆయన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. మహేష్ తో సినిమా ఉంటుందని, చర్చలు జరుగుతున్నాయని ఓ సందర్భంలో సందీప్ కూడా చెప్పాడు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
