జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం-హైలైట్స్

జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మాట్లాడటం ఇదే తొలిసారి. ఒకే భారత్-ఒకే రాజ్యాంగం కల సాకారమైంది. కాశ్మీర్-లఢక్’లో కొత్తశకం ప్రారంభమైంది. సర్ధార్ వల్లభాయ్ పటేల్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందన్నారు. ఇన్నాళ్లు కాశ్మీర్ లో ఉగ్రవాదం, కుటుంబవాదం తప్ప సాధించిందేమీ లేదు. అధికరణ రద్దు తర్వాత కోట్లాదిమంది ఆకాంక్ష నెరవేరిందన్నారు.
దేశంలో ఉన్న బాలబాలికల హక్కులు కాశ్మీర్ పిల్లలకు అందలేదు, దేశవ్యాప్తంగా ఉన్న దళితులపై అత్యాచార నిరోధక చట్టం కాశ్మీర్ లో అమలు కాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న కనీస వేతన చట్టం అక్కడ కాగితాలకే పరిమితమైందని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ అక్కడ లేదని.. ఇకపై ప్రధానమంత్రి స్కాలర్ షిప్ యోజన పథకం పరిధిని పెంచుతామన్నారు. కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న నిర్ణయం చాలా అలోచించి చేసిందేనని.. కొద్దికాలం కోసం చేసిన నిర్ణయం భవిష్యత్ కోసమేనన్నారు.
ఇకపై కాశ్మీర్ లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది.ప్రతి గ్రామ పంచాయతీకి పారదర్శక ఎన్నికలు జరుగుతాయని, ఇకపై కొత్త మంత్రులు, కొత్త ముఖ్యమంత్రులు వస్తారన్నారు. జమ్మూకాశ్మీర్-లఢక్ లో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయని, కాశ్మీర్ ను పర్యాటక రంగంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒకప్పుడు కాశ్మీర్ లో అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుండేదని, ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం సినిమా పరిశ్రమలను మరోసారి కాశ్మీర్ వరకు తీసుకెళ్లాలన్నారు. మొత్తంగా కశ్మీర్ ప్రజలకి భరోసా ఇచ్చేలా ప్రధాని ప్రసంగం సాగింది.
