ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ.. వాయిదా !

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఆరో రోజుకి చేరుకొంది. ఇటు ఆర్టీసీ, అటు ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. సమ్మెని మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రణాఌకలు సిద్ధం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19న తెలంగాణ బంద్ కి పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు.. ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా సకల జనులు సమ్మెలో పాల్గొనేలా కార్యచరణ సిద్ధం చేసుకొంటున్నారు. మరోసారి సకల జనుల సమ్మె చేయాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు.
మరోవైపు, ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై సీరియస్ గా ఉంది. సమ్మే చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని.. ఇందుకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ని త్వరలోనే విడుదల చేయాలనే ప్లాన్ లో ప్రభుత్వం ఉంది. ఇక తాజాగా ఆర్టీసీ సమ్మెపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అంతేకాకుండా కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
మరోవైపు చట్టబద్ధంగానే సమ్మె చేస్తున్నామని కార్మికులు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల వైఖరితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్ కోర్టుకు వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. ఈ నెల 15లోగా పూర్తి వివరాలతో ఆర్టీసీ, కార్మికులు కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే ప్రభుత్వం గానీ, ఆర్టీసీ కార్మికులు తమ తదుపరి కార్యచరణని అమలు చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారమ్.
