ప్రధాని ప్రశంసపై చిరు స్పందన


కరోనా మహమ్మారి కట్టడిలో టాలీవుడ్‌ స్టార్స్ తమవంతు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిరంజీవి, నాగార్జున, యువ కథానాయకులు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి కరోనాపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన ‘వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా… చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా’ అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది . ఈ పాటను విన్న ప్రధాని నరేంద్రమోదీ ఆయా హీరోలను ప్రశంసించారు.

“చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం” అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన మెగాస్టార్  ‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మనదేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి మహాకార్యంలో మేము మా వంతుగా చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి, మా అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు’ అని చిరు ట్వీట్‌ చేశారు.