కానిస్టేబుల్ కి సీపీ అభినందన

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ని సీపీ అంజనీ కుమార్ అభినందించడం హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం రాత్రి సీపీ అంజనీకుమార్ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో చెక్ పోస్టుల వద్ద, కూడళ్లలో డ్యూటీ చేస్తున్న వారి బాగోగులు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
లిబర్టీ వద్ద విధులు నిర్వహిస్తున్న నారాయణగూడ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ సాయికిషన్ తనకు రెండ్రోజుల క్రితం బాబు పుట్టాడని చెప్పగా.. సీపీ ఆశ్చర్యపోయారు. ఇలాంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులకు హాజరైన అతన్ని మెచ్చుకున్నారు. మిఠాయిలు, బిస్కట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీపీ వచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పడంతో కానిస్టేబుల్ సాయి కిషన్ ఆనందానికి అవధుల్లేవు.
