‘పీఎం కేర్’ని దోచేస్తున్నారు

నకిలీలు ఆఖరికి పీఎం కేర్ ని కూడా వదిలిపెట్టడం లేదు. దేశంలో కరోనా కట్టడి కోసం సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధారణ ప్రజలు సైతం పీఎం కేర్ కి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కఠిన సమయాన జాతికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రధాన మంత్రి అత్యవసర పౌర సహాయ, పునరావాస నిధి (పీఎం-కేర్స్)కి విరాళాలు కోరుతూ కొందరు నకిలీ యూపీఐ-ఐడీల ద్వారా ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ (సీఈఆర్‌టీ) బృందం కొన్ని ఫేక్ ఐడీలని గుర్తించింది. పీఎం-కేర్స్ అసలు ఐడీని పోలిన విధంగా పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్ తదితర బ్యాంకుల యూపీఐ హ్యాండిల్ నుంచి నకిలీ ఐడీలను సృష్టించిన విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. pmcares@sbi మాత్రమే నిజమైన ఐడీ.
కానీ pmcares@pnb, pmcares@hdfcbank, pmcare@yesbank, pmcare@ybl, pmcare@upi, pmcare@sbi and pmcare@icici నకీలీ ఐడీల పేరిట పీఎం కేర్ ఫండ్ ని దొంగలించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు.
