తెలంగాణలో లాక్‌డౌన్ మే28 వరకు ?

తెలంగాణలో రెండో విడత లాక్‌డౌన్ ఈ నెల 7తో ముగియనుంది. ఇప్పటికే కేంద్రం ఈనెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందున.. దీన్ని అనుసరిస్తూనే రాష్ట్రంలోనూ మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈరోజు జరగనున్న కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

గత కొన్నిరోజులుగా తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే రాజధాని హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వైరస్ ను వ్యాప్తిని తగ్గించడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 28 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక తెలంగాణలో మద్యం షాపులకి అనుమతులు ఇవ్వడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. మద్యం షాపుల వద్ద సామాజిక దూరం నిబంధనలు అమలు చేయడం కష్టమని.. నిన్న ఏపీలో ఆ విషయం అర్థమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలకి అనుమతులు ఇవ్వొద్దనే వినతులు వస్తున్నాయి. దీనిపై నేటి కేబినేట్ భేటీలు నిర్ణయం తీసుకోనున్నారు.