కోహ్లీ.. దూకుడుకు ప్రతినిధి !

క్రికెట్ చరిత్రలోనే కోహ్లి అత్యుత్తమ ఆస్ట్రేలియన్ కాని ఆస్ట్రేలియన్ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ సారథి, భారత మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. భారతీయ కెప్టెన్ లలో కోహ్లీ ప్రత్యేకమైన వాడు. కెప్టెన్ గా సౌరభ్ గంగూలీ దూకుడు స్వదేశానికే పరిమితం అయింది. కానీ కోహ్లీ మాత్రం విదేశాల్లోనూ దూకుడు చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. చాపెల్ ఇంకెమన్నాడంటే.. ?
“గతంలో భారత జట్లు గాంధేయ సూత్రాన్ని పాటించేవి. అవసరం లేకపోయినా ప్రత్యర్థి జట్లతో గౌరవపూర్వకంగా ఆడేవి. ఈ దృక్పథాన్ని మార్చిన మొట్టమొదటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ. భారత్‌లో ఇది పని చేసింది. విదేశాల్లో ఫలితాల్ని ఇవ్వలేదు. విరాట్ కోహ్లి పూర్తిగా భిన్నం. దూకుడుకు ప్రతినిధి.
ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించాలన్నది అతడి ఆలోచన. క్రికెట్ చరిత్రలోనే కోహ్లి అత్యుత్తమ ఆస్ట్రేలియన్ కాని ఆస్ట్రేలియన్ ఆటగాడు. సరికొత్త టీమ్‌ఇండియాకు ఉదాహరణ. అత్యంత విలువైన ఆటగాడిగా.. క్రికెట్లో శక్తిమంతమైన జట్టుకు సారథిగా ఆట ఆదరణ కోసం బాధ్యతగా కృషి చేస్తున్నాడు. కోహ్లికి ఎల్లప్పుడూ టెస్టు క్రికెటే అత్యున్నతమైనది. కోహ్లి మరింత ఫిట్‌గా.. బలంగా ఉండటానికి టెస్టు క్రికెట్ దోహద పడుతుంది” అని ఛాపెల్ వివరించాడు.
