కరోనా ఉదృతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆస్పత్రులను తిరిగి పూర్తి స్థాయి కొవిడ్‌ అస్పత్రులుగా మార్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కొవిడ్‌ వార్డులు ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందించాలని నిర్ణయించారు.కరోనాపై వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటల శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో నేచర్ క్యూర్ ప్రకృతి చికిత్సాలయం, నిజామియా టీబీ ఆస్పత్రి, ఫీవర్, ఛాతీ ఆస్పత్రులను పూర్తి స్థాయి కరోనా చికిత్స, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు.

జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పేషంట్ కేర్ వర్కర్స్, మందులు, ఆక్సిజన్ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను మంత్రి ఈటెల ఆదేశించారు. హోమ్ ఐషోలేషన్‌లో ఉండేవారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్ఆర్‌నగర్‌లో ఉన్న కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో పని చేయనుంది మంత్రి తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,321 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటి కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,923 యాక్టివ్‌ కేసులున్నాయి.  నిన్న కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కి చేరింది. నిన్న 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.