తెలంగాణలో లాక్‌డౌన్.. సీఎస్ క్లారిటీ !

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నేటి నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ నిర్వహిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. అంతా బాగుంది. అంతా అదుపులో ఉందంటూ చేతులు దులుపుకుంటోంది. తాజాగా మీడియా ముందుకొచ్చిన సీఎస్ సోమేష్ కుమార్.. తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఘనంగా ప్రకటించారు. ఆక్సిజన్ కొరత, కరోనా కేసులు, మృతుల విషయంలో తప్పుడు లెక్కలపై ప్రశ్నిస్తే.. వాటిని ఖండించారు.
జనాలు అనవసరంగా గారాబా పడుతున్నారు. అంతా బాగానే ఉందంటూ.. మీడియాకు ముచ్చట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ చెప్పారు. మెడికల్ ట్రీట్‌మెంట్‌కు హైదరాబాద్ క్యాపిటల్‌గా మారిందని.. నగరంలో తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారని తెలిపారు. గత 15 రోజుల్లోనే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి 33 మెడికల్ ఎయిర్ అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు వచ్చాయని గొప్పగా చెప్పుకొచ్చారు.
ఇక లాక్‌డౌన్‌తో పెద్దగా ఉపయోగముండదు.. వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని సోమేశ్‌కుమార్ తెలిపారు. కరోనా సమస్యకు లాక్‌డౌన్ పరిష్కారం కాదని.. దానివల్ల పెద్దగా ఉపయోగముండదని, జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైనపుడు సీఎం, కేబినెట్ దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇక కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలో సీఎం కేసీఆర్ రాజకీయ రణరంగానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఆ కాకతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో చలికాచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నట్టు.. సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రానికి ఇది చాలు. ఇంక లాక్‌డౌన్ ఎందుకు ? అని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.
