మా ఎన్నికలు.. గంట అదనం.. రికార్డ్ పోలింగ్ !

‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. వాస్తవానికి మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ సమయం ఉండగా… మరో గంట సమయం పొడగించారు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది. చాలా మంది నటీనటులు ఓటు హక్కు వియోగించుకునేందుకు వచ్చే క్రమంలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నారన్న సమాచారం రావడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయం పెంచడానికి ఇరు ప్యానల్ లు నిర్ణయించాయి. దీంతో మధ్యాహ్నం 3గంటలకు పోలింగ్ జరిగింది.
ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మా లో మొత్తం 905 ఓటర్లు ఉన్నాయి. వీటిలో 883 ఓట్లు చెల్లు బాటు అయ్యేవి. అయితే మొత్తంగా 605 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మరో 60 బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 665కు చేరింది. ఈ సారి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు కూడా ఇక్కడకి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జెనిలియా, జయప్రద తదితరులు మా ఓటింగ్ కోసమే వచ్చి వెళ్లారు.
ఇక టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఉదయాన్నే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందరి కంటే ముందే వచ్చి ఓటు వేశారు. ఇక పోలింగ్ సమయంలో చిన్నపాటి వాగ్వాదాలు తప్ప.. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇరు ప్యానల్ వాళ్లు గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఫైనల్ గా ఎవరు గెలిచిన మాకు మంచి జరగాలని బాలయ్యతో మెజారిటీ నటీనటులు కోరుకుంటున్నారు.
