ఆ రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం.. సీనియర్ అధికారుల హెచ్చరిక

అభివృద్ధికి పెద్దపీట వేయడం లేదు. అప్పు చేసి పప్పు కూడు ఫార్ములాని ఫాలో అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆ రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తేప్రమాదం ఉందని సీనియర్ అధికారులు హెచ్చరించారు. శనివారం రాత్రి మోదీ.. తన క్యాంప్ కార్యాలయంలో నాలుగు గంటల పాటు.. వివిధ విభాగాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. పలు పాలనాపరమైన విషయాలపై చర్చించారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇద్దరు కార్యదర్శులు కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును మోదీ దృష్టికి తీసుకొచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆర్థికంగా కుదేలైన ఓ రాష్ట్రంలో ప్రకటించిన ప్రజాకర్షక పథకాలను వారు ప్రస్తావించారు. ఈ మార్గాన్నే మరికొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఆర్థికంగా అమలు చేయడం కష్టమని తెలిసినా.. ప్రజలను మోసపుచ్చుతున్నాయని అన్నారు. ఈ బాటలో కొనసాగితే ఆ రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తేప్రమాదం ఉందన్నారు.
