కాంగ్రెస్ లేకుండా బీజేపీపై పోరాడలేం

బీజేపీ వ్యతిరేక పోరాటంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను మినహాయించలేం అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని బలోపేతం చేసే చర్యలకు తన సహకారం, మద్దతు కొనసాగిస్తానని తెలిపారు.
కాంగ్రెస్ ఇపుడు అధికారంలో లేకపోయినా, అది అఖిల భారత పార్టీ. దేశంలో ఏ గ్రామానికి వెళ్లినా కార్యకర్తలు ఉంటారు. కాబట్టి, భాజపాపై పోరాటంలో విస్తృతమైన స్థాయి ఉన్న కాంగ్రెస్ పార్టీ అనివార్యమని పవార్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నపుడు కొన్ని నిజాలు విస్మరించలేం. టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో బలీయమైన శక్తి. అదేవిధంగా ఆయా ప్రాంతీయ పార్టీలు కూడా తమ తమ రాష్ట్రాల్లో బలమైన శక్తులేనని ఆయన అన్నారు.
మరోవైపు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నినాదంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేకుండా బీజేపీ పై పోరాడలేమని శరాద్ పవార్ క్లారిటీ ఇచ్చినట్టయింది.
