కొండా కమల తీర్థం ఖాయం

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. బుధవారం ఆయన.. మహబూబ్‌నగర్‌లో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. అరగంట పాటు చర్చలు జరిపారు. అంతకుముందు బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌రెడ్డితో మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం జితేందర్‌రెడ్డితో కలిసి సంజయ్‌ వద్దకు వెళ్లారు.

వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి విశ్వేశ్వర్‌రెడ్డికి బీజేపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ‘నా చేరిక బీజేపీ చేతల మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ భేటీపై కొండా ఆచితూచి మాట్లాడారు. బీజేపీ ఇంకా పుంజుకుంటే అనేకమంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ నెల 14న సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభ తుక్కుగూడలో జరుగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రానున్నారు. ఆయన సమక్షంలో విశ్వేశ్వర్‌రెడ్డి.. బీజేపీలో చేరతారని సమాచారం.