ఢిల్లీలో హైదరాబాద్ గెలుపు

ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢిల్లీలో ఓడించింది సన్ రైజర్స్ హైదరాబాద్. గురువారం ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(11), శిఖర్‌ధావన్(12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(43) ఒంటరి పోరాటం చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్, మహ్మద్ నబీ, సిద్ధార్థ్‌కౌల్ రెండేసి వికెట్లు, రషీద్‌ఖాన్, సందీప్‌శర్మ చెరో వికెట్ పడగొట్టారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలో అదరగొట్టింది.
ఓపెనర్ బెయిర్‌స్టో(48) ఫోర్ల వర్షం కురిపించారు. కేవలం 28బంతుల్లోనే 48పరుగులు సాధించాడు. మోరీస్ వేసిన ఓవర్ లో నాలుగు ఫోర్లు, రబడ వేసిన ఓవర్ లో మూడు ఫోర్లు బాదేశాడు. చివరకు రాహుల్ తివాతియ వేసిన ఓవర్ లో బెయిర్‌స్టో ఎల్భీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ డేవిడ్‌వార్నర్(10) కూడా అవుటయ్యారు. విజయ్‌శంకర్(16), మనీశ్‌పాండే(10), దీపక్ హూడా (10) పరుగులు చేసి అవుటయ్యారు. 17ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 114/5 నిలిచింది. ఉత్కంఠగా మారిన మ్యాచ్ ని మహ్మద్ నబీ(17) గెలిపించాడు.ఈ విజయంతో సన్ రైజర్స్ విజయాల పట్టికలో టాప్ స్థానానికి చేరుకొంది.
