డివిలియర్స్ రీ-ఎంట్రీ.. జోక్ కాదు !

ఐపీఎల్ 2019 సందర్భంగా ఓ ప్రెస్మీట్లో డివిలియర్స్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో తన పునరాగమనం గురించి ఎందుకు ప్రశ్నించరంటూ జర్నలిస్టులతో అన్నారు. అప్పుడది అందరు జోక్ అనుకొన్నారు. కానీ, అది జోక్ కాదు. ఏబీ మనసులోని మాట. నిజంగానే ఏబీ రీ-ఎంట్రీకి ట్రై చేశారు. ప్రపంచకప్లో ఆడేందుకు 15 మందితో కూడిన తుది జట్టుకు ఎంపికకు సరిగ్గా 24 గంటల ముందు డివిలియర్స్ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ను, కోచ్ గిబ్సన్తో పాటు మేనేజ్మెంట్కు సంబంధించిన కీలక వ్యక్తులను కలిశాడట.
తనకు జట్టులో చోటు కల్పించాలని కోరాడు. ఐతే, అందుకు వారు ససేమిరా అన్నారని వార్తలు వస్తున్నాయి. ఇది దక్షిణాఫ్రికా ఎంపిక నియమావళికి విరుద్ధం కావడంతో మేనేజ్మెంట్ తిరస్కరించినట్లు సమాచారం. దీనికి తోడు జట్టులో బాగా రాణిస్తున్న వాన్ డర్ డుస్సెన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టాల్సి రావడం ఇంకో కారణం. దీంతో డివిలియర్స్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. 2018 మే నెలలో డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
