ఇక కవితకి న్యాయం చేయాల్సి ఉంది !

ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ హరీష్ రావుకి అన్యాయం చేశారనే ప్రచారం జరిగింది. కొడుకు కేటీఆర్ కోసం హరీష్ ని తొక్కేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడీ ఆ అపవాద చెరిగిపోయింది. తాజా కేబినేట్ విస్తరణలో హరీష్ రావుకి మంత్రి పదవి దక్కింది. ఆయనకి కీలకమైన ఆర్థికశాఖని అప్పగించారు. అల్లుడుతో పాటు కొడుకు కేటీఆర్ ని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు సీఎం కేసీఆర్.
కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్, ఐటీ, పరిశ్రమల శాఖలునే తిరిగి అప్పగించారు. దీంతో కొడుకు, అల్లుడుకి ఒకేసారి న్యాయం చేసినట్టయింది. ఇక మిగిలింది కూతురు కవిత. ఆమెకి ఏవిధంగా న్యాయం చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ కి మంత్రిపదవి ఇచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలని కవితకి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కవితని రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలిగా చేస్తారనే రూమర్స్ వచ్చాయి.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి కవితను పోటీచేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఐతే, తాను ఓడిపోయినా నిజామాబాద్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లబోనని కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకి సీఎం కేసీఆర్ ఎలా న్యాయం చేస్తారు ? ఆమెని రాజ్యసభకి పంపిస్తారా ?? పార్టీలో కీలక పదవికి కట్టబెడతారా ?? లేదంటే వచ్చే ఎన్నికల వరకు విశ్రాంతి తీసుకోమని నచ్చజెబుతారా ?? అన్నది చూడాలి.
