2020 సీఎంగా కేటీఆర్

2014 నుంచి తెలంగాణలో తెరాస విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. అద్భుతమైన పాలనతో దేశానికే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆదర్శంగా నిలిచేలా చేశారు.

ఈ క్రమంలో వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. 2018యేడాది చివరలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస మరోసారి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. కొన్నాళ్ల నుంచి 2020లో కేటీఆర్ సీఎం కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తునాయి. 

తాజాగా ఈ ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. 2019 తమకు బ్రహ్మండమైన ఆరంభం ఇచ్చిందన్నారు. 2020 కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో శుభారంభం చేస్తామని కేటీఆర్ అన్నారు. 

అంతేకాదు.. 2020లో తాను సీఎం అవుతాననే ప్రచారంపై అసలు చర్చే అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్.  దీనిపై సీఎం కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. దానికి తిరుగులేదన్నారు. ఇక కొత్త దశకంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. ఈ నెల మొదటివారంలో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం ఉంటుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ పార్టీ నేతలకి దిశానిర్థేశం చేయనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.