ముంబై.. హ్యాట్రిక్ మిస్ !

ఐపీఎల్ 14వ సీజన్ తుది అంకానికి చేరింది. ఇక ప్లేఆఫ్స్ మాత్రమే మిగిలాయి. అయితే ఐపీఎల్ లో బలమైన జట్టు ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఛాన్స్ కోల్పోయింది. వరుసగా మూడోసారి ఫైనల్స్ చేరే అవకాశాన్ని ముంబయి కోల్పోయింది. గత రెండు సీజన్లలో ఛాంపియన్స్‌గా అవతరించిన రోహిత్ జట్టు.. ఈసారి 14 పాయింట్లతో కోల్‌కతాతో సమానంగా నిలిచింది. కానీ, రన్‌రేట్ పరంగా కాస్త వెనుకంజలో ఉండటంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లలేకపోయింది. ఇక చెన్నై గతంలో వరుసగా మూడేళ్లు ఫైనల్స్ చేరి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2010, 2011లో ఛాంపియన్స్‌గా నిలిచిన ధోనీసేన తర్వాత రెండేళ్లు రన్నరప్‌గా నిలిచింది. చెన్నై తర్వాత ముంబయి ఆ రికార్డును చేరుకోలేకపోయింది.
పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఆశించినంత మేర రాణించలేక చతికిలపడింది. వరుసగా ఏడోసారి ప్లేఆఫ్స్ చేరుకోలేకపోయింది. దీంతో ఇప్పటివరకు దిల్లీ క్యాపిటల్స్‌తో సమానంగా ఉన్న ఈ పేలవ ప్రదర్శన రికార్డును అధిగమించింది. దిల్లీ 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆరేళ్లు ప్లేఆఫ్స్ చేరలేదు. ఇప్పుడు పంజాబ్ ఏడేళ్లు విఫలమైంది. 2014లో చివరిసారి ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరింది. 2016లో తొలిసారి ఛాంపియన్స్‌గా అవతరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అత్యంత నిలకడైన జట్టుగా గతంలో పేరు ఉండేది. వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్ చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, అంతమంచి పేరున్న హైదరాబాద్ ఈసారి మరీ ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలే సాధించి ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆఖరి స్థానంలో నిలిచింది.
