ఈ నగరానికేమైంది ? ఎటు చూసిన డ్రగ్స్.. డ్రగ్స్ !

మొన్ననే పోలీసులు చేసిన వేర్వేరు దాడుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న, సేవిస్తున్న ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కు బానిసైన ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడని తెలిసింది. అంతేకాదు.. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది తెలిసిందే. నిన్న ఏకంగా జూబ్లీ పబ్ లోనే డ్రగ్స్ విచ్చల విడిగా డ్రగ్స్ పాకెట్స్ కనిపించాయి. 

బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. అనేకమంది ప్రముఖుల పిల్లలు పాల్గొన్న పార్టీలో మత్తుమందులు పట్టుబడటంపై దుమారం రేగుతోంది. 

ఈ పార్టీలో పాల్గొన్న 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 20 మంది పబ్‌ సిబ్బందే. 5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నాం. పబ్‌ ప్రవేశానికి నిర్దేశించిన యాప్‌లో ప్రస్తుతం 250 మంది నమోదై ఉన్నారు. దీనికి మాదక ద్రవ్యాలు ఎలా వస్తున్నాయి? ఎవరితో సంబంధాలున్నాయి.. ఎవరు తీసుకున్నారు.. అనే విషయాలపై ఆరా తీస్తున్నాం. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన వారిలో గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌, నటి నిహారిక తదితరులు ఉన్నారు. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కుమారుడు, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది.

నిజానికి చాలామంది పబ్‌లో జరిగే వారాంతపు పార్టీకనే వచ్చినా అక్కడ మత్తుమందులు దొరకడంతో ఆ సమయంలో ఉన్న అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరు మత్తుమందులు వాడారన్నది నిర్ధారణ కాలేదు. వాటిని సరఫరా చేసిన వారు దొరకడంతో ఎవరి కోసం తెచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పబ్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై మేనేజర్‌ మహదారం అనిల్‌కుమార్‌ (35), భాగస్వామి అభిషేక్‌ ఉప్పాల (35), అర్జున్‌ వీరమాచినేనిలపై కేసు నమోదు చేసి అనిల్‌కుమార్‌, అభిషేక్‌ను అరెస్ట్‌ చేశారు. అర్జున్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.