చెన్నై హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఓడింది. ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. లివింగ్‌స్టోన్ (60; 32 బంతుల్లో 5×4, 5×6) చెలరేగడంతో మొదట పంజాబ్ 8 వికెట్లకు 180 పరుగులు సాధించింది. జోర్డాన్ (2/23), ప్రిటోరియస్ (2/30) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
ఛేదనలో చెన్నై తేలిపోయింది. వైభవ్ అరోరా (2/21), లివింగ్‌స్టోన్ (2/25), రాహుల్ చాహర్ (3/25)ల ధాటికి 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. రబాడ, అర్ష్‌దీప్, ఒడియన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబె (57; 30 బంతుల్లో 6×4, 3×6) చెన్నై తరఫున టాప్ స్కోరర్. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన లివింగ్‌స్టోన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
చెన్నై టీమ్ మళ్లీ గాడిలో పడాలంటే కొత్త దారి కనుక్కోవాలని ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి భరోసా ఇవ్వాలి. అతడికి అండగా ఉండాలి. అతడెంత మంచి ఆటగాడో మా అందరికీ తెలుసు. కచ్చితంగా అతడి విషయంలో అండగా ఉంటాం. రాబోయే మ్యాచ్‌ల్లో అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని ఇలాగే సానుకూల దృక్పథంతో ఉంచగలిగితే మా జట్టుకు కలిసివస్తుంది. ఇకపై శక్తి మేరకు ప్రయత్నించి తిరిగి బలం పుంజుకుంటామని జడేజా అన్నాడు.
