సచిన్ బ్యాట్’తో.. అఫ్రిది విధ్వంసకర బ్యాటింగ్.. !

వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రికార్డ్ పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది పేరుమీదుంది. 1996లో శ్రీలంకతో మ్యాచ్ లో అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇందులో 11సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ సంచలన ఇన్నింగ్స్ తోనే అఫ్రిది వెలుగులోనికి వచ్చాడు. ఐతే, సచిన్ బ్యాటుతోనే అఫ్రిది ఈ ఇన్నింగ్స్ ఆడాడట. ఈ విషయాన్ని అఫ్రిది తన ఆత్మకథ ‘గేమ్ ఛేంజర్’లో పేర్కొన్నారు. సచిన్ బ్యాటు తన చేతికి ఎలా వచ్చిందన్న విషయాన్ని కూడా వివరించారు.

“సచిన్ తనకెంతో ఇష్టమైన బ్యాటు కొలతలతోనే మరో బ్యాటు తయారుచేయించమని వకార్ యూనిస్ కు పాత బ్యాటు ఇచ్చాడు. పాకిస్థాన్ లోని రావల్పిండి అంటే క్రీడా ఉపకరణాల తయారీకి పెట్టింది పేరు. ఐతే, వకార్ యూనిస్ ఆ బ్యాటును రావల్పిండి తీసుకెళ్లడానికి ముందు నాకిచ్చాడు. ఆ బ్యాటుతోనే లంక బౌలర్లను చితకబాదా”నని అఫ్రిది తెలిపాడు. అంటే.. అఫ్రిది సంచలన ఇన్నింగ్స్ లో సచిన్ కు క్రెడిట్ ఉందన్నమాట. ఇక, అఫ్రిది తన ఆల్ టైమ్ వరల్డ్ వన్డే జట్టులో సచిన్ కు చోటు కల్పించకపోవడం గమనార్హం.

ఇక, అఫ్రిది ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డుని తర్వాతి కాలంలో న్యూజిలాండ్ ఆటగాడు అండర్ సన్ చెరిపేశాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అండర్ సన్ కేవలం 36బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మిస్టర్ 360 డివిలియర్స్ కేవలం 31బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇతడు కూడా వెస్టీండీస్ పైనే ఈ ఘనతని సాధించాడు.