ఇకపై ఆన్ లైన్ లో మందు

ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు చేపట్టాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ తో ఆన్ లైన్ లో మద్యం మరింత సేఫ్ గా భావిస్తున్నారు. మూడో విడత లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం షరతులతో కూడిన మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ నిబంధనలని తుంగలో తొక్కి మందు కోసం షాపుల ముందు బారులు తీరారు మందు బాబులు. ఓ జాతరలా తరలివచ్చారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి షాక్ తగిలింది.

ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలకి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టోకన్ పద్దతిలో మద్యం అమ్మకాలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. తాజాగా ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆన్‌లైన్‌ లిక్కర్ సేల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై మద్యం షాపుల వద్ద లైన్లను తగ్గించేందుకు డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆన్ లైన్ లిక్కర్ అమ్మకాల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.