అశ్విన్.. ఎమోషనల్ ట్వీట్

రవిచంద్రన్ అశ్విన్ – టీమిండియా కీలక బౌలర్. అయితే అది ఒకప్పుడు. అశ్విన్ టీ20, వన్డే ఆడక నాలుగేళ్లు అవుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ లోనూ నాలుగు టెస్టులకు అతడిని ఆడించనేలేదు. అలాంటి అశ్విన్ అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్ కి ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో యష్ ఎమోషనల్ ట్విట్ చేశాడు.

“ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది. అయితే, వెలుతురు చూడగలమని నమ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బతికుంటారు’ అని రాసిన చిత్రాన్ని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఈ మాటలను గోడపై అంటించడానికి ముందే కొన్ని లక్షల సార్లు నా డైరీలో రాశాను! మనం చదివే మంచి మాటలను అన్వయించుకొని, జీవితంలో ఆచరిస్తే అవి మనకు మరింత ప్రేరణ, బలాన్ని ఇస్తాయి’ అని రాశాడు.

111 వన్డేలాడిన అతడు 32.91 సగటుతో 150 వికెట్లు తీశాడు. 46 టీ20ల్లో 22.94 సగటు, 6.97 ఎకానమీతో 52 వికెట్లు పడగొట్టాడు. ఇక 79 టెస్టులాడి 24.56 సగటు, 2.80 ఎకానమీతో 413 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.